Listen to this article

జనం న్యూస్‌ 20 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

​రాష్ట్రంలో వివిధ జిల్లాలలో పోలీసులు చేధించిన ముఖ్య కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఎ.బి.సి.డి. (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డును రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం మాజీ ఎంపిపి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును చేధించినందుకుగాను విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ (అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ)ను రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించి, ఎ.బి.సి.డి. అవార్డును ప్రదానం చేసినట్లు డిసెంబర్ 19న తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ – తేది 22-04-2025న ప్రకాశం జిల్లా, ఒంగోలు మెయిన్ రోడ్డు వద్ద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటిపై వచ్చి ముప్పవరపు వీరయ్య చౌదరిని కత్తులతో విచక్షణ రహితంగా 49 పోట్లు పొడిచి అక్కడ నుండి పారిపోయారన్నారు. అనంతరం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐ.టి, ఎలక్ట్రానిక్స్, హెచ్.ఆర్.డి. మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనిత మరియు గుంటూరు రేంజ్ ఐజిపి సర్వశ్రేష్ఠ త్రిపాఠి భౌతికకాయంను సందర్శించి, నివాళులు అర్పించి, హత్య కేసును తొందరగా చేధించి, నిందితులను పట్టుకొని చట్టం ముందు నిలపాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యతను పెంచిందన్నారు.​జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డిఎస్పి స్థాయి అధికారులతో వెంటనే 60 క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, రాత్రింబవళ్లు శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ వ్యవధిలోనే సంచలన హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చి, 9మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండుకు పంపారన్నారు. సంచలన హత్య కేసును తక్కువ వ్యవధిలో చేధించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ను రాష్ట్ర డిజిపి ప్రత్యేకంగా అభినందించి, కేసు చేధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులు మరియు సిబ్బందికి నగదు బహుమతిని ప్రదానం చేసారన్నారు.ప్రతీ మూడు మాసాలకు ఒకసారి వివిధ జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టి, చేధించిన కేసుల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన కేసులను “అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్” అవార్డుకు ఎంపిక చేసి, రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు. 2025 సం. రెండవ క్వార్టరుకు వివిధ జిల్లాల కేసుల దర్యాప్తును పరిశీలించి, ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదయిన సంచలన హత్య కేసును చేధించినందుకు ఎబిసిడి అవార్డు లభించిందన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎబిసిడి అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.