Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 22

ఈరోజు తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికీ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జగన్ మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు. తమిళనాడులోని ఈరోడ్ లో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మల్, శ్రీనివాస అయ్యంగారి దంపతులకు 1887 డిసెంబర్ 22న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు.జి ఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్ లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్జీబ్రా,అనలైటికల్ జామెట్రిలాంటి విషయాలకు సంబంధించిన 6,165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద, పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తండాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకో లేకపోయినా సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవాడు. 1909 లో జానకి అమ్మాలను వివాహం చేసుకున్నారు. మ్యాజిక్ స్క్వేర్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టీషియన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆయన కేం బ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హెరాల్డ్ హార్టీ కి పంపాడు. మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసి హార్టీ, రామానుజన్ ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్ కి వెళ్ళిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితం పై పరిశోధన చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన తొలి భారతీయుడు గాను,ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడు గాను ఆయన చరిత్రకి ఎక్కారు. లండన్ లో ఆహారం సరిగా తీసుకోక అనారోగ్యం పాలై తిరిగి ఇండియాకి 1919 మార్చిలో వచ్చారు. మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఎట అనగా ఏప్రిల్ 26 1920 సంవత్సరంలో కన్నుమూశారు. గణిత శాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది.తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ప్రొఫెసర్ హార్టీ కి 1729 సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆయనను ఆశ్చర్యపరిచారు. గణితం పై ఆయనకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకితభావానికి ఇది నిదర్శనం అని విద్యార్థులకు తెలియజేశారు. ప్రేరణ కలిగించే అలాంటి వారి జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని, అంకితభావంతో విద్య పట్ల శ్రద్ధచూపితే ఎవరైనా గొప్పవారు అవుతారని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఎం అనూష మరియు విద్యార్థులు పాల్గొన్నారు.