జనం న్యూస్ 23 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఎపిఎస్పీ బెటాలియన్సుకు ఎంపికైన 208 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ళు శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, శిక్షణ కార్యక్రమాన్ని డిసెంబరు 22న పోలీసు పరేడ్ గ్రౌండులో ప్రారంభించారు.ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుళ్ళుగా ఎంపికై, పోలీసుశాఖలోకి నూతనంగా ప్రవేసించిన అభ్యర్థులకు డిఐజి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. సమాజం పట్ల, నేరాల నియంత్రణ పట్ల పోలీసులకు గురుతరమైన బాధ్యత ఉందన్నారు. విధి నిర్వహణలో పోలీసులు అనేక రకమైన ఛాలెంజ్లను ఎదుర్కొంటున్నారన్నారు. ఇందులో ప్రధానమైన సిబ్బంది కొరత, మారుతున్న నేరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంను వృద్ధి కాకపోవడం, మతపరమైన, శాంతిభద్రతల సమస్యలు తరుచూ ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ తరహా ఛాలెంజ్ ను ఎదుర్కొనడానికి పోలీసులు మరింతగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు ప్రతీ పోలీసు ఉద్యోగి సమన్వయంతో, మానవత దృక్పథంతో పని చేసి, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చెయ్యాలన్నారు.
సాధారణంగా సమాజంలో 95-98 శాతం ప్రజలు చట్టాన్ని గౌరవిస్తుంటారని, మిగిలిన వారిలో 2-5 శాతం వ్యక్తులు మాత్రమే చట్టాన్ని ఉల్లంఘిస్తుంటారన్నారు. వీరిలో ఒక్క శాతం కంటే తక్కువ మంది మాత్రమే నేరాలకు పాల్పడే లక్షణాలుంటాయన్నారు. ఒక్క శాతం కంటే తక్కువ ఉండే నేర ప్రవృత్తి కలిగిన వారిపై పోలీసు ఉద్యోగులు దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. లేకంటే వీరు సమాజంలో అశాంతి, నేరాలకు పాల్పడుతూ, చట్టాన్ని ఉల్లంఘిస్తూ శాంతిభద్రత సమస్యలకు కారకులవుతుంటారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకు అవసరమైన క్రమశిక్షణ, అంకితభావాన్ని శిక్షణ నుండే అలవర్చుకోవాలన్నారు. శిక్షణకు వచ్చిన వారిలో చాలామంది విద్యావంతులు ఉన్నారని, శిక్షణలో చెప్పిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని, అన్ని రంగాల్లో రాణించి, విధి నిర్వహణలో నిపుణులుగా మారాలన్నారు.
సాంకేతికతను వినియోగించుకొని నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని, ఏ విభాగంలోనైనా, ఎక్కడైనా పని చేసేందుకు ప్రతీ ఒక్కరూ సిద్దంగా ఉండాలన్నారు. ఏ తరహా నేరాలు, ఎటువంటి శాంతిభద్రత సమస్యలు ప్రస్తుత రోజుల్లో ఉత్పన్నమవుతున్నాయన్న విషయాలను గమనిస్తూ, వాటికి అనుగుణంగా పని చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలన్నారు. కానిస్టేబుళ్ళు క్షేత్ర స్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని, వారితో ఏవిధంగా ప్రవర్తించాలి, సమస్యలను పరిష్కరించేందుకు ఏవిధంగా వ్యవహరించాలన్న విషయాలను శిక్షణలో తెలుసుకోవాలన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు పునాదులు వేసుకొని, పోలీసుశాఖకు, ప్రజలకు ఉత్తమ సేవలందించాలని శిక్షణ కానిస్టేబుళ్ళుకు విశాఖ పట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ ఎపిఎస్పీ, సివిల్ వంటి విభాగాలు పోలీసుశాఖలో ఉన్నప్పటికీ అందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వారమేనన్న విషయాన్ని మరువవద్దన్నారు. శిక్షణ లో ఔట్ డోర్, ఇండోర్ శిక్షణతోపాటు టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్, యోగా, ఆయుధాల వినియోగం, స్విమ్మింగ్, మ్యాప్ రీడింగులో పట్ల శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణలోని ప్రతీ అంశంలోను నైపుణ్యం సాధించి, సైబరు నేరగాళ్ళను అరికట్టే సైబర్ వారియర్స్గా మారాలన్నారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు శిక్షణ లో మార్పులు చేసారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ ముగిసేనాటికి ప్రతీ ఒక్కరూ శారీకంగా, మానసికంగా బలోపేతం కావాలన్నారు. శిక్షణలో పొందిపర్చిన ప్రతీ అంశం కూడా మిమ్ములను వృత్తిపరంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే అని గ్రహించాలన్నారు. శిక్షణలో ప్రాంతాలు, కులాలు, మతాలు అన్న వ్యత్యాసం వద్దని, అందరూ సోదరభావంతో వ్యవహరిస్తూ, అత్యుత్తమ శిక్షణ పొందాలన్నారు. శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన పోలీసు అధికారులను ఎంపిక చేసి, ఫ్యాకల్టీగా నియమించామని, వారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని, వృత్తి నైపుణ్యంను మెరుగుపర్చుకొని, సాంకేతికతతో నేరాలను నియంత్రించడం, నమోదైన కేసులను చేధించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ పట్ల శ్రద్ద పెట్టి, క్రమశిక్షణ, అంకిత భావంతో వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. విజయనగరం డిపిటిసిలో శిక్షణ పొందినందుకు ప్రతీ ఒక్కరూ గర్వంతో తలెత్తుకొనేలా శిక్షణ ఉంటుందని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు.
డిపిటిసి ప్రిన్సిపాల్ మరియు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మాట్లాడుతూ శిక్షణ నిమిత్తం ఎపిఎస్పీ నాలుగు బెటాలియన్స్ శ్రీకాకుళం 39, రాజమహేంద్రవరం 52, ప్రకాశం -53, చిత్తూరు 64 మంది, మొత్తం 208 వచ్చారన్నారు. వీరిలో 147మంది గ్రాడ్యుయేషను, 12మంది పోస్టు గ్రాడ్యుయేషను, 28 మంది బి.టెక్, ముగ్గురు ఎల్.ఎల్.బి., ఇద్దరు జర్నలిజం పూర్తి చేసిన విద్యావంతులున్నారన్నారు. తొమ్మిది మాసాల శిక్షణ తేది. 21-09-2026 తో పూర్తవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిపిటిసి డిఎస్పీ పి.నారాయణరావు, డిఎస్పీలు ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఈ. కోటిరెడ్డి, డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, శిక్షణకు వచ్చిన కానిస్టేబుళ్ళు, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.నేను మీ కోసం చేయగలిగే తదుపరి పని.


