జనం న్యూస్ 23 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముడసలపేట గ్రామం ఎయిర్ పోర్టు కాలనీలో డిసెంబరు 12న జరిగిన లాభాపేక్ష హత్య కేసును భోగాపురం పోలీసులు చేధించి, వృద్ధురాలు (నాన్నమ్మ)ను హత్య చేసిన నిందితుడు (మనమడు) ముడసల గౌరి (27 సం.లు)ను డిసెంబరు 22న అరెస్టు చేసి, అతని వద్ద నుండి 18.250 గ్రాముల బంగారు వస్తువులను, 106 గ్రాముల వెండి పట్టీలను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే – భోగాపురం మండలం ముడసలపేట గ్రామానికి చెందిన ముడసల అప్పయ్యమ్మ (70సం.లు) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిపైగల బంగారు చెవి రింగులు, చెవి మధ్య రింగులు, జుమ్మాలు, ముక్కు కమ్ములు, వెండి పట్టీలను దొంగిలించుకొని పోయారని మృతురాలి కోడలు ముడసల లక్ష్మి డిసెంబరు 13న ఇచ్చిన ఫిర్యాదు మేరకు భోగాపురం పోలీసులు కేసు నమెదు చేసి, దర్యాప్తు చేసారన్నారు. ఈ కేసులో విచారణ చేపట్టి, నేర స్థలంను క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయన్నారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో భోగాపురం సిఐ కే.దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.పాపారావు, సిసిఎస్ ఎస్ఐ కే. లక్ష్మణరావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి. విచారణ చేపట్టారన్నారు. నేర స్థలం పరిశీలన సమయంలో డాగ్ స్క్వాడ్ నిందితుడు ముడసల గౌరి చుట్టూ తిరగడంతో అనుమానంతో అతని కదలికలపై నిఘా పెట్టామన్నారు. నేరం జరిగి కొద్ది రోజులు పూర్తవ్వడం, నిందితుడు ముడసల గౌరిపై పోలీసులకు అనుమానం లేదని భావించి, దొంగిలించిన వస్తువులను అమ్మేయాలన్న ఉద్దేశ్యంతో వాటిని తీసుకొని వెళ్ళుతుండగా భోగాపురం పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుండి 18.250 గ్రాముల బంగారు వస్తువులను, 106 గ్రాముల వెండి పట్టీలను రికవరీ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో మృతురాలు తన కుమార్తె, చిన్న కుమారుడుకు తన వద్ద ఉన్న డబ్బులు ఇస్తున్నట్లు, పెద్ద కుమారుడి కుటుంబానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగా ఆమెపై కక్ష పెంచుకున్నాడన్నారు. డిసెంబరు 12న పెద్ద కుమారుడు కొడుకైన ముడసల గౌరి మద్యం మత్తులో తన నాన్నమ్మను బైకు ఫైనాన్స్ కట్టేందుకు డబ్బులు అడిగినట్లు, ఆమె నిరాకరించడంతో ఆమె ముఖంపై తలగడతో అదిమి హత్య చేసి, ఒంటిపైగల చెవి కమ్ములు, జుమ్మాలు, చెవి మద్య రింగులు, రోల్డ్ గోల్డ్ చైను, వెండి పట్టీలను దొంగిలించారన్నారు. మృతురాలు బహిర్భూమికి బయటకు వెళ్ళే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, మృతురాలి ఒంటిపై బంగారు వస్తువులు తీసుకొని పోయినట్లుగా మభ్య పెట్టేందుకు శవంను ఇంటి నుండి బయటకు తీసుకొని వెళ్ళి, నూతికి సమీపంలో పడేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టి, లాభాపేక్ష హత్య కేసు మిస్టరీని చేధించామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన డీఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సీఐ కే.దుర్గా ప్రసాద్, ఎస్ఐలు పి.పాపారావు, కే.లక్ష్మణరావు, ఎఎస్ఐ గౌరి శంకర్ మరియు ఇతర పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రధానం చేసారు.
గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వృద్దులు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి వ్యక్తుల భద్రత పట్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో నివాసం ఉంటున్న ఇటువంటి వ్యక్తుల పట్ల తాము కూడా సమాచారం సేకరించి, వారిని అప్రమత్తం చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.


