జనం న్యూస్ 26 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి,కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిత మిషన్ పథకం వల్ల ప్రజలు, కార్మికుల వేతనాలు పెరగకుండా కేంద్రం అడ్డుకునే చర్యలకు పాల్పడుతున్నదని సీఐటీయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ, వివి నరసింహ తెలిపారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో, అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనే నిబంధన ఉండేదని, దీనివల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు కూలీలు వేతనాలు కూడా పెంచుకునే హక్కు ఉండేదని అన్నారు.కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకంలో అటువంటి హామీ ఏమీ లేదని అన్నారు. దేశంలో ఒకవైపు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే గ్రామీణ కూలీల వేతనాలు ఏ విదంగా తగ్గిస్తారని ప్రశ్నించారు.గతంలో ఉన్న చట్టంలో 100 రోజులు నిర్విరామంగా పని నడిపే నిబంధన ఉండేదని కానీ కొత్త పథకంలో వ్యవసాయ సీజన్ లో 60 రోజుల పాటు పనిని బంద్ చేయాలనే నిబంధన తీసుకోచ్చారని, దీనివల్ల భూస్వాములకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల కంటే రాష్ట్రాలలో కూలీలకు ఎక్కువ వేతనాలు ఇవ్వవచ్చనే నిబంధన గతంలో ఉండేదని ఇప్పుడు దానిని రద్దు చేశారని విమర్శించారు. ఇప్పటికే ఉపాధికి ఆధార్ లింకు, కొలతలను బట్టి వేతనాలు, రెండు పూటలా హాజరు,కేవైసీ వంటి నిబంధనలు పెట్టి ప్రజలు, కార్మికులను ఉపాధికి దూరం చేసే ప్రయత్నం చేశారని, ఇప్పుడు వచ్చిన కొత్త పథకం ద్వారా పూర్తిగా బయోమెట్రిక్ జిపి ట్రాక్ ను చట్టబద్ధం చేసి చట్టాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వాల విధానాల వల్ల, వాతావరణ అననుకూల పరిస్థితుల వల్ల వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని, ఇటువంటి పరిస్థితులలో గ్రామీణ పేదలకు కొద్దో గొప్పో ఉపయోగపడే గ్రామీణ ఉపాధి చట్టాన్ని కూడా రద్దుచేసి పేదల కడుపు కొట్టవద్దని సూచించారు. కావున తక్షణమే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి, పని దినాలను 200 రోజులకు పెంచి, కనీస వేతనం 600 రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు నరేష్, బాబన్న, రామకృష్ణ, మల్లేష్, వీరేష్, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.ధన్యవాదాలతో ఉప్పేర్ నరసింహ సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు జోగులాంబ గద్వాల


