జనం న్యూస్ 26 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
పండుగ పూట చిన్నారికి కన్నీళ్లు.. ఆసుపత్రిలో చికిత్స చోద్యం చూస్తున్న అధికారులు..పట్టించుకోని మున్సిపల్ అధికారులు. నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రజాప్రతినిధులు. అయిజ మున్సిపాలిటీ వార్త :అయిజ పట్టణ కేంద్రంలో కోతుల స్వైరవిహారం హద్దులు దాటుతోంది. నిన్నమొన్నటి వరకు ఆహారం కోసం ఇళ్లపై పడ్డ వానర సైన్యం, ఇప్పుడు నేరుగా పసిపిల్లల ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా పట్టణంలోని 3వ వార్డు ఎస్సీ కాలనీ లోని మారెమ్మ గుడి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మారెమ్మ గుడి పరిసరాల్లో ఆడుకుంటున్న ఒక ఐదేళ్ల బాలికపై కోతులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. చిన్నారి అని కూడా చూడకుండా ఆమెపై పంజా విసిరి, విచక్షణారహితంగా కరవడంతో ఆ బాలిక కేకలు వేస్తూ విలవిలాడిపోయింది. గమనించిన స్థానికులు కోతులను తరిమికొట్టి, రక్తమోడుతున్న ఆ చిన్నారిని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆమెకు కుట్లు వేసి చికిత్స అందించారు. పండుగ పూట ఆడుకోవాల్సిన ఆ పసిబిడ్డ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం:అయిజలో కోతుల బెడద ఇంతలా ఉన్నా అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “ఈ పాపం ఎవరిది? చోద్యం చూస్తున్న అధికారులదా.. లేక అధికారులతో పని చేయించలేని ప్రజాప్రతినిధులదా?” అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే అనేకమార్లు విన్నవించినా, పట్టణ అధికారులు కానీ, అటవీ శాఖ వారు కానీ కోతులను పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.జిల్లా యంత్రాంగం స్పందించాలి:జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి, తక్షణమే కోతులను బంధించి అడవులకు తరలించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మొద్దునిద్ర వీడతారా లేక మరిన్ని ప్రాణాలు ప్రమాదంలో పడే వరకు వేచి చూస్తారా అని ప్రజలు మండిపడుతున్నారు.


