Listen to this article

జనం న్యూస్‌ 27 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

త‌ల్లితండ్రుల‌ను కోల్పోయి అనాధ‌లుగా మారిన జ‌న్నివ‌ల‌స గ్రామానికి చెందిన ఇద్ద‌రు బాలుర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అండ‌గా నిలిచారు. వారికి ఇళ్లు మంజూరు చేయ‌డ‌మే కాకుండా, చ‌దువుకొనేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని, హాస్ట‌ల్ సీట్ల‌ను మంజూరు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.జామి మండ‌లం జ‌న్నివ‌ల‌స గ్రామానికి చెందిన మైల‌ప‌ల్లి విజ‌య్‌(12), గౌత‌మ్‌(10) కొద్ది కాలంలోనే త‌ల్లితండ్రుల‌కు కోల్పోయారు. వారి చిన్న‌త‌నంలోనే తండ్రి కేన్స‌ర్‌తో మ‌ర‌ణించ‌గా, త‌ల్లి ఆరు నెల‌ల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. దీంతో అనాధలుగా మారిన ఈ బాలురు ఇద్ద‌రూ త‌మ పెద్దమ్మ ఎద్దు కొండ‌మ్మ ఇంటివ‌ద్ద ఆశ్ర‌యం పొందుతున్నారు. విజ‌య్ జామి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో 7వ త‌ర‌గ‌తి, గౌత‌మ్ గ్రామంలోని ఎంపిపి పాఠ‌శాల‌లో 5వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ టి.విమ‌లారాణి ద్వారా ఈ బాలురిద్ద‌రూ త‌మ పెద్ద‌మ్మ‌తో క‌లిసి శుక్ర‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ ను క‌లుసుకున్నారు. వీరి ద‌య‌నీయ ప‌రిస్థితిని తెలుసుకున్న జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి చ‌లించిపోయి, వారికి అన్నివిధాలా స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇళ్లు మంజూరు చేస్తామ‌ని, హాస్ట‌ల్ సీట్ల‌ను కేటాయిస్తామ‌ని చెప్పారు. బాగా చ‌దువుకొని వృద్దిలోకి రావాల‌ని ఆ బాలుర‌కు క‌లెక్ట‌ర్ సూచించారు.