జనం న్యూస్ 27 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాస్ రావు (జమ్ము శ్రీను), ఆయన కుమార్తె విజయనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపేన శశి భార్గవి జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈనెల 28న విజయనగరం మోసానికి టెంపుల్ లో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, జిల్లా జనసేన పార్టీ ఇంచార్జి పాలవలస యశస్విని ల సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు జమ్ము శ్రీను పేర్కొన్నారు. శుక్రవారం ఒక ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయనతో పాటు పార్వతీపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆదాడ మోహన్ రావు తదితరులతో కలిసి జమ్ము శ్రీను మాట్లాడారు. తాను గత 33ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ అనేక పదవులు నిర్వహిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు నిత్యం అనేక సేవలు అందించానని గుర్తు చేశారు. రాజకీయంగానే కాకుండా క్రీడలు, సాంస్కృతిక అసోసియేషన్ల అధ్యక్షుడిగా కూడా తన సేవలను అందించినట్టు తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివాద రహితునిగా, తాను పని చేసిన పార్టీకి బద్ధుడునై విధేయతతో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్ష పదవులు వరకు సేవలు అందించానని తెలిపారు. ఏడాది క్రితం వరకు వైసీపీలో ఉంటూ తన కుమార్తె శశి భార్గవి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేసిందని, తాను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితురాలై జనసేనలో చేరాలని నిర్ణయించుకుందన్నారు. దాంతో ఏడాది క్రితం వైసీపీను వీడిన మేము జనసేనలో చేరాలనుకున్నప్పటికీ వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉండడం వల్ల ఆలస్యం జరిగిందన్నారు. ఐతే పవన్ కళ్యాణ్ చరిష్మా వల్ల టీడీపీ రెండు సార్లు అధికారంలోకి రావడంతో పాటు, తాను పోటీ చేసిన రెండు చోట్లా ఒక ఎన్నికల్లో ఓడిపోయి అనేక అవమానాలకు గురైనప్పటికీ తన ఆశయాలను వీడకుండా, పట్టుదలతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకోవడం మాకు పవన్ కళ్యాణ్ పట్ల స్ఫూర్తిని కలిగించిందన్నారు. అందుకే తాను, తన కుమార్తెతో పాటు మా అనుచర వర్గ ఎంపీటీసీలు, సర్పంచ్ లు కూడా జనసేనలోకి రావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఐతే స్థానిక ఎన్నికల్లో తమకు జనసేన తరుపున సీట్లు ఇప్పిస్తామన్న హమీను వారు కోరగా, అది సాధ్యపడదని, పార్టీలోకి చేరిన తర్వాత ఆ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పని చేయాలని తాను వారికి సూచించినట్టు జమ్ము శ్రీను పేర్కొన్నారు. దీంతో 28 న జరిగే కార్యక్రమంలో తాను, తన కుమార్తె శశి భార్గవి తో పాటు తమ అభిమానులు, అనుచరులతో భారీగా జనసేనలోకి చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. తాను పదవులు ఆశించి పార్టీలో చేరడం లేదని, తాను ఎవరికీ పోటీగా ఎక్కడా నిలబడనని, తాను ఏదైనా పదవికి పోటీ చేయాలనుకున్నపుడు అక్కడ పోటీ చేయాలనుకున్న వ్యక్తి తనను సంప్రదిస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి వెనుకడుగు వేయబోనని పేర్కొన్నారు. కోవర్ట్ రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని, కోలగట్ల వీరభద్ర స్వామి తనికి రాజకీయ గురువు అని, కానీ వైసీపీ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నేతలు, నాయకులతో తనకున్న అన్ని సంబంధ బాంధవ్యాలను తెంచుకున్నట్టు జమ్ము శ్రీను విలేకరుల ప్రశ్నలకి సమాధానంగా పేర్కొన్నారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు అక్కడ అప్పగించిన పదవులకు, బాధ్యతలకు పూర్తి స్థాయిలో పని చేసిన తర్వాతనే అక్కడ నిష్క్రమించాలని, అది ఆ పార్టీ పట్ల మనం రుణం తీసుకున్నట్టు అవుతుందనేది తన సిద్ధాంతమని జమ్ము శ్రీను పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు రమేష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


