జనంన్యూస్ 29.నిజామాబాదు.
నిజామాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న కళాభవన్ (కళాభారతి) పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం ప్రారంభమైన శాసనసభ శీతాకాల సమావేశాల్లో జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన, నిజామాబాద్ జిల్లా కళలు, కళాకారులు, సాహిత్యానికి పుట్టినిల్లు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.116 కోట్లతో కళాభారతి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.50 కోట్ల నిధులే విడుదల కావడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయని తెలిపారు.కాంట్రాక్టర్‌కు బకాయిలు పెండింగ్‌లో ఉండటం, అంచనాలు మారడం వల్ల రూ.70 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉందని ఎమ్మెల్యే వివరించారు. అద్భుతమైన నిర్మాణంగా రూపుదిద్దుకుంటున్న కళాభవన్ పూర్తయితే జిల్లా కళాకారులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు శాశ్వత వేదికగా నిలుస్తుందని అన్నారు.
అందువల్ల కళాభవన్ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి మిగిలిన నిధులను వెంటనే మంజూరు చేసి, నిజామాబాద్ నగరానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.


