Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా సైబర్ క్రైమ్ ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో మునగాల పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు,ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు విద్యార్థులు వివరించాలన్నారు. మన ప్రమేయం లేకుండా వచ్చే ఓటీపీ షేర్ చేయడం, ఆన్లైన్లో ఉద్యోగాల కోసం వెతకడం,ఆన్లైన్ కస్టమర్ కేర్ నంబర్స్ వెతకడం మొబైల్స్ ఫోన్లోకి వచ్చే అనుమానిత లింక్స్ క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయన్నారు.లోన్ యాప్లకు దూరంగా ఉండాలని, కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్లో అసలు వెతుకవద్దని, ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నెంబర్లను పొందాలని సూచించారు. అపరిచిత నెంబర్ల నుంచి ఫేస్బుక్ వాట్సప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దని తెలిపారు. లాటరీ ఆఫర్ లంటూ వచ్చే మెసేజ్లను నమ్మొద్దు వంటి పలు సూచనలు చేశారు.ఆన్ లైన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో రోజురోజుకు సైబర్ మోసాలుపెరిగిపోతున్నాయి అన్నారు.తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ మోసపూరిత ప్రచారాలతో ప్రజలను బూరడీ కొట్టిస్తున్నారని, ఇటువంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈజీ మనీ ఆశలో పడి మోసపోవద్దని సూచించారు.కొన్ని గంటల్లో, ఒక్క రోజులోనే, వారం రోజుల్లోనే రెట్టింపు నగదు ఇస్తామంటూ ఆన్ లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఎరవేస్తూ సైబర్ మోసగాళ్లు కుచ్చుటోపి పెడుతున్నారని తెలిపారు. అలాంటి సైబర్ మోసగాళ్లు విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు,మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మిస్తూ మోసం చేస్తున్నారని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సైదయ్య గౌడ్, కానిస్టేబుల్ జ్యోతి, శివ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.