Listen to this article

జనం న్యూస్ 03 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా చోద్యం చూస్తున్న పాలకులు.పట్టించుకోని అధికారులు.సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకోలు.మల్దకల్: మండలం ఉలిగేపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రతిరోజు విధిగా డ్రైనేజీ నిర్వహణ చేపట్టాల్సిన అధికారులు అలసత్వం వహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డ్రైనేజీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేపట్టకపోవడంతో సక్రమంగా కొనసాగడం లేదని గ్రామంలో విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీలు నిండి అంగన్వాడి కేంద్రం ముందు రోడ్డుపై మురుగు నిలుస్తున్నా మురుగునీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మురికి నీరు రోడ్డుపైనే నిలుస్తుండడంతో పరిసరాలు దుర్గంధం వెదజలతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నిలుస్తున్న డ్రైనేజీ నీరులో దోమలు, ఈగలు, పందులు సైతం వీరవిహారం చేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. దోమలు, ఈగలు ఇండ్లలోకి రావడం వలన ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవలే కురిసిన వర్షాలకు డ్రైనేజీ పూర్తిగా పాడైపోయింది. దీంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు దోమల బెడదతో మరింత కష్టాలు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు పోవడానికి కొన్నిచోట్ల కాలువలు ఉన్న అవి పూడుకుపోయి నిరుపయోగంగా మారాయి. దీంతో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరియు పాలకులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.