

జనం న్యూస్- ఫిబ్రవరి 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం నాడు శ్రీలంక దేశపు టూరిజం ప్రమోటర్స్ సందర్శించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాలను శ్రీలంక దేశంలో ప్రమోట్ చేయడానికి అక్కడ దేశపు టూరిజం మరియు ట్రావెల్ కి సంబంధించిన ప్రతినిధులు బుధవారం నాగార్జునసాగర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ బృందం టూరిజం లాంచీలో నాగార్జున కొండకు చేరుకొని అక్కడ మ్యూజియం ని పునర్ నిర్మిత కట్టడాలైన సింహాల విహారం, మహా స్థూపం ను సందర్శించారు. మూడవ శతాబ్దానికి చెందిన తమ దేశపు సింహల విహారాన్ని వారు సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. నాగార్జునకొండ చారిత్రక విశేషాలను స్థానిక టూరిజం గైడు సత్యనారాయణ వారికి వివరించారు .అనంతరం బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఈవో శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర లు స్వాగతం పలికారు. అక్కడ ఈ బృందానికి బుద్ధ వనం కన్సల్టెంట్ చారిత్రక నిపుణులు ఈమనీ శివనాగిరెడ్డి బుద్ధవనం విశేషాలను వారికి తెలియజేశారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్రం లోని నేలకొండపల్లి , ఫణిగిరి బౌద్ధ ప్రాంతాలను సందర్శించి వరంగల్ జిల్లాకు చేరుకుంటారు. వరంగల్ ,హనుమకొండ లోని చారిత్రక ప్రదేశాలను ,దేవాలయాలను సందర్శించిన అనంతరం హైదరాబాదులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. శ్రీలంక దేశపు పర్యాటకులను తెలంగాణలోని పర్యటక ప్రాంతాలను సందర్శించే విధంగా శ్రీలంక ట్రావెల్ అండ్ టూర్స్ ప్రతినిధులను తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. వీరితోపాటు తెలంగాణ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ సాయిరాం, శ్రీలంక ఎయిర్లైన్స్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.