Listen to this article

జనం న్యూస్‌ 06 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

సోమవారం ఆర్టీసి హౌస్ లో ఆర్టీసి వి.సి మరియు ఎం.డి. సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ఏ.పి.పి.టీ.డి (ఆర్టీసి) అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 8000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను విన్నవిస్తూ, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని యూనియన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఆర్టీసిలో కాంట్రాక్టు వ్యవస్థ వల్ల కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. యాజమాన్యం నిర్ణయించిన జీతాలు కార్మికులకు అందడం లేదని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రతి కార్మికుడికి యాజమాన్యం ద్వారానే నేరుగా జీతాలు చెల్లించే విధంగా చూడాలని కోరారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తంగుడు ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి గంగాంజనేయులు ఆధ్వర్యంలో ఎం.డి.కి మెమోరాండం అందజేశారు. కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి, కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లిస్తే ఉద్యోగ భద్రత కలుగుతుందని వివరించారు. దళారి కాంట్రాక్టర్ల వల్ల జీతాలు సక్రమంగా అందడం లేదని, ఆర్టీసి మేనేజ్ మెంట్ నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు చెల్లించేలా చూడాలని కోరారు. హయర్ బస్సు, ఆన్ కాల్ డ్రైవర్లకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ నివేదిక ప్రకారం న్యాయం చేస్తాం: ఎం.డి.ఈ సందర్భంగా ఆర్టీసి ఎం.డి. మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంస్థ పరంగా సాధ్యమైనంత వరకు సహాయం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపిపిటిడి ఔట్ సోర్సింగ్ రాష్ట్ర కమిటీ నాయకులు వి.బాజి, ప్రసాద్ కుమార్, మధుసూదనరావు, దాసరి కిరణ్, అర్జున్, అశోక్, పార్వతి, రూపా తదితరులు పాల్గొన్నారు.