Listen to this article

ప్రతి పాఠశాలలో ఆంగ్లంతో పాటు తెలుగు బోధన తప్పనిసరి చేస్తాం

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం – సీఎం చంద్రబాబు నాయుడు

జనం న్యూస్ 06జనవరి ( కొత్తగూడెం నియోజకవర్గం) గుంటూరు / అమరావతి | జనవరి 6


ప్రపంచానికి వెలుగును చూపిన భాష తెలుగు అని, ఆంగ్ల మాధ్యమాలు ఎన్ని ఉన్నా తెలుగు భాష గొప్పతనాన్ని ఎవ్వరూ తగ్గించలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి – గుంటూరు జిల్లాలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో, మాస్కో డాక్టర్ గజల్ శ్రీనివాస్ నిర్వహణలో జనవరి 3, 4, 5 తేదీలలో నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా విజయవంతమయ్యాయి.మహాసభల చివరి రోజు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని, ఈ మహాసభలకు 40 దేశాల నుంచి తెలుగువారు పాల్గొనడం అభినందనీయం అని అన్నారు.తెలుగు నిరంతరం వెలుగుతూనే ఉంటుంది “దేశభాషలందు తెలుగు లెస్స” అన్న శ్రీకృష్ణదేవరాయల మాటలు నేటికీ సత్యమని, పరభాషా పాలకులు పాలించినా తెలుగు భాషపై ఎలాంటి ప్రభావం పడలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.అన్నమయ్య, నన్నయ్య, తిక్కన, పోతన, ఎర్రప్రగడ, శ్రీనాథుడు, కవి సార్వభౌములు, గిడుగు రామ్మూర్తి వంటి మహానుభావులు తెలుగు బ్రతికేందుకు, తెలుగు విలువలు పెంపొందేందుకు చేసిన కృషిని సీఎం గుర్తు చేశారు.ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగు వ్యాకరణ బోధన తప్పనిసరి చేసేలా ఆదేశాలు జారీ చేస్తానని, అలాగే సంగీత కళాశాలలు ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.భద్రాద్రి కొత్తగూడెం కవుల విశేష పాల్గొనడం ఈ మహాసభలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడ మండలం రామవరం ప్రాంతానికి చెందిన అభ్యుదయ సామాజిక కవులు తూముల శ్రీనివాస్, మహమ్మద్ ముస్తఫా, సయ్యద్ అబ్దుల్ నజీర్లు పాల్గొన్నారు. జనవరి 6న శ్రీ జాషువా – శ్రీ కరుణ – శ్రీ వేదికపై నిర్వహించిన “తెలుగు తల్లికి సహస్ర కవితా నీరాజనం” కవి సమ్మేళనంలో పాల్గొని,గజల్ కవి గజల్ రాజేష్, డాక్టర్ ఎస్.ఆర్.ఎస్. కొల్లూరి, శ్రీ కలిమి శ్రీ సంచాలకులుగా నిర్వహించిన సభలో కవులు సబికుల కరతాళ ధ్వనుల మధ్య ప్రశంసలు అందుకున్నారు.
సాంస్కృతిక వైభవానికి చిరునామా మూడు రోజుల పాటు మహాసభల ప్రాంగణంలో యువ ఆవధానాలు, వేలాది మంది విద్యార్థులచే తెలుగు వైభవ సాంస్కృతిక ప్రదర్శనలు, హరికథ, బుర్రకథ, పద్య నాటకం, సాంఘిక నాటకం, జానపద కళలు, శాస్త్రీయ లలిత సంగీతం, చలనచిత్ర సంగీతం, కూచిపూడి నృత్యం, హాస్య కదంబరాలు, సాహితీ సదస్సులు, వీధి నాటకాలు, కవి సమ్మేళనాలు, సంచార జాతుల కళాకారుల ప్రదర్శనలు, ఆంధ్ర వైభవ పురాతన నాణేల ప్రదర్శన, తెలుగు కార్టూన్లు, చిత్రలేఖన ప్రదర్శనలు, లఘు చలనచిత్రాలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, పద్య శతక సామూహిక పఠనం, ఆంధ్ర వంటకాలు, పిండి వంటలు, తెలుగు వెలుగు శిల్పారామం, తోలుబొమ్మలాట, బొమ్మలాట, శ్రీ రసరాజు రచన – డాక్టర్ గజల్ శ్రీనివాస్ రూపొందించిన ‘తెలుగు తోరణం క్షేత్ర దర్శిని’ ప్రత్యేక నృత్య రూపకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రముఖుల హాజరు ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అశోక్ గజపతిరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు.మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోత్సవంగా నిలిచాయని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.