Listen to this article

రూ.91 లక్షల నిధులు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లికి సుగుణక్క కృతజ్ఞతలు

జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

ఆసిఫాబాద్: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ అభివృద్ధికి మార్గం సుగమమైందని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. మార్లవాయి అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.91 లక్షల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో మార్లవాయి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా, గ్రామ చరిత్రతో పాటు అక్కడి సమస్యలు, పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సుగుణక్క తెలిపారు. ఆ సందర్భంగా మంత్రి స్థానిక ఆశ్రమ పాఠశాలలో రాత్రి బస చేయడం ద్వారా గ్రామ పరిస్థితులను స్వయంగా పరిశీలించారని చెప్పారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మార్లవాయి గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తాను మంత్రి జూపల్లికి విజ్ఞప్తి చేయగా,మంత్రి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని సుగుణక్క వెల్లడించారు. సీఎం స్పందించి గ్రామ అభివృద్ధికి రూ.91 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.ఈ నిధులతో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్‌ల కాంస్య విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన చరిత్రాత్మక మార్లవాయి గ్రామం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోనుందన్నారు.మార్లవాయి అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులకు సుగుణక్క ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.