Listen to this article

నందికొండలో హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం

జనం న్యూస్- జనవరి 8- నాగార్జున సాగర్ టౌన్ –

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై నాగార్జునసాగర్ పట్టణ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదాలలో వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తీవ్ర రక్తస్రావానికి గురై వైద్యం అందించే సమయం లేకపోవడంతో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల హెల్మెట్ ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. స్థానిక పెట్రోల్ బంక్ లలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ బంక్ లలో పెట్రోల్ నింపుతారని ఆయన తెలిపారు. పెట్రోల్ బంకు యజమానులకు సైతం హెల్మెట్ ధరించిన వాహనదారులకు మాత్రమే పెట్రోలు నింపాలని పోలీసు వారి ఆదేశాలను పాటించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై ముత్తయ్య, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.