Listen to this article

జనం న్యూస్ 08 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నిన్న బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ,ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణ, ఇతర సంబంధిత అంశాలపై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి,మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం, 2019లోని సవరించిన సెక్షన్ 195-ఎ ప్రకారం 12.01.2026 నాడు వార్డు వారీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని, ఈ నెల 13 న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను టి-పోల్‌లో అప్‌లోడ్ చేయాలని, అలాగే 16వ తేదీ నాడు ఫోటోతో కూడిన తుది ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని సూచించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సుల అంచనాను ముందస్తుగా తయారు చేయడంతో పాటు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు,ఎఫ్ఎస్టీ , ఎస్.ఎస్.టి ల నియామకాలను సమయానికి పూర్తిచేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం అవసరమైన ఉద్యోగుల వివరాలను టి-పోల్ నందు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను వార్డుల వారీగా పకడ్బందీగా రూపొందించాలన్నారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.అక్టోబర్ 1, 2025 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ప్రతి ఓటర్‌ను వారి నివాస భౌగోళిక పరిధి,ఇంటి నంబర్,వార్డు సరిహద్దుల ఆధారంగా సంబంధిత వార్డులోనే నమోదు చేయాలన్నారు.ఒక వార్డులో నివసిస్తూ మరో వార్డులో నమోదైన ఓట్లను గుర్తించి,క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు.గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల నమోదైన ఓట్లకు ప్రత్యేకంగా మ్యాపింగ్ నిర్వహించాలన్నారు. ప్లాట్ నంబర్ ఆధారంగా నమోదైన ఓటర్లను గుర్తించి, మ్యాపింగ్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు సులభంగా చేరుకునేలా ఉండాలని,గుర్తింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.ప్రతి మున్సిపాలిటీలో.నామినేషన్,పోలింగ్,ఓట్ల లెక్కింపు సమయంలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని,ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.