Listen to this article

జనం న్యూస్‌ 14 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు పరేడ్ గ్రౌండులో ‘సంక్రాంతి సంబరాలు – 2026’ ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 13న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సతీమణి ఎ.ఆర్.రూపా నాయుడు ముఖ్య అతిధిగా హాజరై, సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు పోలీసు కుటుంబాలను కూడా భాగస్వాములను చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మహిళా పోలీసు ఉద్యోగులు, పోలీసు కుటుంబ మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – సంక్రాంతి వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కలయికతో సంక్రాంతి నిర్వహించుకోవాలనే సదుద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించుకున్నామన్నారు. సంక్రాంతి పండుగ అన్నది ఒక మతానికి, కులానికి చెందినది కాదని, రైతులు కష్టించి పండించిన పంట చేతికి రావడంతో కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకొనే వేడుక అని అన్నారు. ప్రజలు పండుగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, పోలీసులకు సహకరించి పండుగని సౌహార్ద వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.ఎస్పీ సతీమణి ఎ.ఆర్.రూపా నాయుడు మాట్లాడుతూ – సంక్రాంతి సంబరాలను పోలీసు కుటుంబాలతో కలిసి ఒకే వేదిక మీద జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. హోదాలకు అతీతంగా పోలీసు కుటుంబాలు సొంత కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి వేడుకలను జరుపుకున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.సంక్రాంతి సంబరాల్లో భాగంగా పోలీసు ఉద్యోగినులకు, పోలీసు కుటుంబాల మహిళలకు ప్రత్యేకంగా రంగోలి, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ఖాకీ యూనిఫారం ధరించే పోలీసు అధికారులు, సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంబరాల్లో హరిదాసు కీర్తనలు, బసవన్న విన్యాసాలు, కోలాట ప్రదర్శన అందరిని అలరించాయి. అనంతరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఆయన సతీమణి ఎ.ఆర్.రూపా నాయుడు భోగి మంట వెలిగించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.ఈ సంక్రాంతి సంబరాల్లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎన్.రాఘవులు, జి.భవ్య రెడ్డి, ఆర్.వీరకుమార్, పి.నారాయణరావు, ఇ.కోటిరెడ్డి మరియు పెద్ద సంఖ్యలో పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.