Listen to this article

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా హన్మంత్ షిండే వినూత్న ఉద్యమం

బిచ్కుంద జనవరి 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారి అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఆ రోడ్డు పనులు పూర్తికాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా మారిందని జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే తీవ్రంగా విమర్శించారు.సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బిచ్కుంద పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై ప్రజల దృష్టిని ఆకర్షించేలా ముగ్గులతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధిని నిలిపివేసిన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఈ నిరసన సాగింది.ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ,
“బిచ్కుంద మెయిన్ రోడ్డు పట్టణానికి హృదయం లాంటిది. అలాంటి రోడ్డు పనులను మధ్యలో ఆపేసి రెండేళ్లు గడిచినా పూర్తి చేయకపోవడం ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి అన్న మాటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కి తెలియదా అనే అనుమానం కలుగుతోంది” అని అన్నారు.అభివృద్ధి పనులు పూర్తి చేయక ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఇక సహించబోమని హెచ్చరించిన షిండే , తక్షణమే బిచ్కుంద మెయిన్ రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి మరింత ఉధృతమైన ఉద్యమాలకు సిద్ధమని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.