Listen to this article

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కేలా వేదికగా ఈనెల 16 నుండి 18 వరకు జరుగుతున్న పారా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన వడ్డి సతీష్ కుమార్ సాహు గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ లో విజయనగరంలో జరిగిన పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుండి 5 గురు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక కాగా అందులో విజయనగరం నుండి వడ్డి సతీష్ కుమార్ సాహు ఒకరని తెలిపారు. అన్ని రాష్ట్రాల నుండి పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో జాతీయ పోటీల్లో పాల్గొన్నప్పటికి సాహు అత్యుత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ సాధించడం తన కృషి కి, సంకల్పనికి, నిరంతర సాధనకు నిదర్శనమని ప్రశంసించారు. సాహు విజయం పట్ల జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు లు అభినందనలు తెలియజేసారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మరింత పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.