Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నందలూరు జనవరి 19: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ వారి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల,నందలూరు నందు “పోలీస్ కళా-జాగృతి బృందం” ఇన్‌చార్జ్ జి.నరసరామ్ బృందంచే ‘ఓయువతా. మేలుకో”నాటక ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రాజంపేట గ్రామీణ సిఐ మస్తాన్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకంవల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, సమాజంలోని రుగ్మతలు వాటివలన కలిగే అనర్ధాల గురించి వివరించారు. నేటి సమాజంలో యువత “డ్రగ్స్”కు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.నందలూరు ఎస్.ఐ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మత్తుపదార్థాలు వాడిన, అమ్మిన, ఆశ్రయం కల్పించిన దానికి తగిన శిక్షలు గురించి తెలియజేశారు. మత్తు పదార్థాల ఆచూకీ తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కి కాల్ చేసి తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలు మరియు మహిళా భద్రత, శక్తి-యాప్ పై విద్యార్దులకు వివరించారు.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ మీ తల్లి దండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చి, సమాజానికి మీవంతు ఉపయోగపడాలని హితువు పలికారు.అలాగే నార్కోటిక్స్ ఏఎస్ఐ మల్లయ్య విద్యార్దులచే యువతా మేలుకో-మత్తు నుండి తేరుకో, డ్రగ్స్ వద్దు- జీవితం ముద్దు, మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం- భవిష్యత్తును కాపాడుకుందాం అని నినాదాలు చేయించారు.
పోలీసు కళా-జాగృతి బృందం నాటక మరియు పాటల నృత్య ప్రదర్శన విద్యార్థులను విశేషంగా అలరించింది.ఈకార్యక్రమంలో కళాబృంద సభ్యులు ఎస్ఐ సుబ్రహ్మణ్యం, సుశీల, మేషక్ బాబు, ఉదయ్ కుమార్, శ్రీరామ్ కుమార్, మధు సూదన్, కరుణాకర్, కాలేజ్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.