జనం న్యూస్ జనవరి 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: శ్రీనివాస్ రెడ్డి
గణతంత్ర దినోత్సవాల సందర్భాన్ని అవకాశంగా మలచుకుంటూ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ప్రజలలో దేశభక్తి ఉత్సాహాన్ని, పండుగ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని “ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్” అంటూ నకిలీ లింకులను వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ లింకులను క్లిక్ చేస్తే ఐదు వేల రూపాయల ఉచితంగా లభిస్తాయి అంటూ ఆశ చూపిస్తూ అమాయకులను బుట్టలో వేస్తున్నారు. అంతేకాదు, “మొదట నకిలీ అనుకున్నాను… కానీ నిజంగానే డబ్బులు వచ్చాయి. మీరు కూడా ప్రయత్నించండి” అంటూ నమ్మకం కలిగించే సందేశాలతో లింకులను షేర్ చేయిస్తున్నారు.
ఇది పూర్తిగా సైబర్ నేరగాళ్లు ఉపయోగించే సైకాలజికల్ ట్రిక్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నేహితులు, బంధువులు లేదా గ్రూపుల ద్వారా వచ్చినా ఇలాంటి సందేశాలను చూసిన వెంటనే ఒక్క నిమిషం ఆలోచించాలని సూచిస్తున్నారు.ప్రత్యేకంగా ఆ మెసేజ్ చివర ఉన్న లింకులను గమనించాలని చెబుతున్నారు.http://fdgc.lusvv.xyz, http://iom.qmtyw.xyz వంటి అర్థం లేని అక్షరాలతో ఉన్న లింకులు ఫోన్ పే లేదా గూగుల్ పే అధికారిక లింకులు కావని స్పష్టంగా తెలుసుకోవాలి.ఈ లింకులను క్లిక్ చేస్తే ఫోన్లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ప్రవేశించి, బ్యాంక్ పిన్లు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా క్షణాల్లోనే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
ఫోన్ పే, గూగుల్ పే లేదా ఏ ఇతర డిజిటల్ చెల్లింపు సంస్థ అయినా వాట్సాప్ లింకుల ద్వారా నగదు ఆఫర్లు ఇవ్వవు. ఏ ఆఫర్ ఉన్నా అది తప్పనిసరిగా వారి అధికారిక యాప్‌లోనే కనిపిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఒకవేళ ఎవరైనా పొరపాటున ఈ లింకులు క్లిక్ చేసి మోసపోయినట్లయితే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.డబ్బు ఆశకు మోసపోకుండా, అప్రమత్తతే రక్ష అని పోలీసులు, సైబర్ నిపుణులు ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.


