జనంన్యూస్. 24.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ నగర శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కారుతో ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. సౌమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ వుమెన్ కానిస్టేబుల్ పై హత్యా యత్నానికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీస్ కమిషనర్ ను కోరతామని అన్నారు. సౌమ్య వెంటిలేటర్ పై ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. సౌమ్య ఆరోగ్యం సహకరించిన వెంటనే ఉన్నత స్థాయి వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించేలా ఏర్పాట్లు చేశామని, ఆమె వైద్యం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వ పరంగా అందించడం జరుగుతుందని తెలిపారు. కాగా, సంఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తక్షణమే స్పందించి సౌమ్యకు సీ.పీ.ఆర్ చేయడం ఎంతగానో ఉపకరించిందని ఈ సందర్భంగా స్వప్నను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.విధి నిర్వహణలో స్వీయ భద్రత పాటించాలి.కాగా, ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ విధి నిర్వహణ సమయంలో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. అభివృద్ధి పనుల ప్రగతిపై కలెక్టరేట్ లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనను ప్రస్తావించారు. విధి నిర్వహణలో ఉన్న తరుణంలో హత్యా యత్నానికి గురై తీవ్రంగా గాయపడిన సౌమ్య ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. విధులు నిర్వర్తించే సమయాలలో ఉద్యోగులు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.



