జనం న్యూస్ జనవరి 29: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీని ఎంపీవో శివచరణ్ గురువారం సందర్శించారు. గ్రామంలో అవసరమైన నిధులు, పలు అభివృద్ధి పనుల గురించి ఆయన స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ మాట్లాడుతూ—ఇటీవల జిల్లా కేంద్రం నిజామాబాద్లో కలెక్టర్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య నివారణకు 60 నుండి 80 వేల లీటర్ల సామర్థ్యం గల పెద్ద వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు. సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లలో ఉన్న హై టెన్షన్ విద్యుత్ తీగల తొలగింపు, గ్రామంలోని మహిళలు మరియు వృద్ధులకు నూతన పెన్షన్ల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు సహా పలు అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోరినట్లు వారు వివరించారు.ఈ వినతులపై పై అధికారుల ఆదేశాల మేరకు ఎంపీవో గ్రామానికి వచ్చి పరిస్థితులను పరిశీలించి వివరాలు సేకరించినట్లు సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీవోతో పాటు పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, కారోబార్ కొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


