జనం న్యూస్, ఫిబ్రవరి 1 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి : శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని పాపారాయుడు నగర్లో గల శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ పూజా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఆలయ ప్రాంగణంలో వైభవంగా సాగింది. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సమస్త ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ,ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యత, ధార్మిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ముఖ్యంగా యువత ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములవ్వడం ద్వారా క్రమశిక్షణ, సత్సంకల్పం అలవడుతుందని, సంప్రదాయాలు–సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.
అలాగే ఈ పూజా కార్యక్రమాన్ని అత్యంత సుందరంగా, క్రమబద్ధంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరింత వైభవంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల్లో పాల్గొనడంతో పాపారాయుడు నగర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.



