జనం న్యూస్ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశాఖ గ్లోబల్ క్యాన్సర్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ శరీరంలో ఉండే కణజాలం నియంత్రణ లేకుండా పెరగడాన్ని క్యాన్సర్ అంటారని, దీర్ఘకాలంగా తగ్గని పుండు, నెలల తరబడి తగ్గని జ్వరం, మల, మూత్రాలలో అధిక రక్తస్రావం వంటి దీర్ఘకాలిక లక్షణాలను క్యాన్సర్‌గా అనుమానించాలని తెలిపారు.భారతదేశంలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, గ్రామీణ ప్రాంతంలో సర్వైకల్ క్యాన్సర్ లాంటివి తరచూ కనిపిస్తున్నాయని, వీటిని నివారించేందుకు వ్యాక్సినేషన్ ఒక మంచి మార్గమని చెప్పారు. 9 నుంచి 26 సంవత్సరాల మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం వలన ఆరు రకాల క్యాన్సర్లను నివారించవచ్చని తెలిపారు. హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ద్వారా కాలేయ సంబంధిత క్యాన్సర్లను అడ్డుకోవచ్చని వివరించారు.ప్రజలు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని, మంచి సమతుల్య ఆహారం తీసుకుంటూ, ప్రతి రోజు 30 నిమిషాల పాటు వాకింగ్, వ్యాయామం చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. భయంతో కాకుండా ధైర్యంతోనే క్యాన్సర్‌ను జయించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ రమాదేవి, ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్య సంఘం జోనల్ కార్యదర్శి గెద్ద చిరంజీవి, జోనల్ గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు జి.భవాని, ఝాన్సీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


