జనం న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా
వేల్పూరు మండలంలోని అంకాపూర్ వైదిక ధ్యాన యోగ ఆశ్రమంలో గురువారం 8వ రోజు అధర్వవేద పారాయణ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామి భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో అత్యంత మహనీయుడైన రాజు, వీర యోధుడు, దూరదృష్టి గల పరిపాలకుడని అన్నారు. ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం స్వరాజ్య భావనకు బలమైన పునాది వేసిందని తెలిపారు.శివాజీ మహారాజ్ జీవితం ధైర్యం, ధర్మం, న్యాయం, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే స్వరాజ్య స్థాపన లక్ష్యంగా ముందుకు సాగిన ఆయన, ప్రజల స్వేచ్ఛ, స్వాభిమానం కోసం పోరాడారని అన్నారు. “గణిమికావా” అనే గెరిల్లా యుద్ధ విధానంతో శత్రువులను ఎదుర్కొని, కోటలు, నౌకాదళాన్ని బలపరిచారని వివరించారు.యోధుడిగా మాత్రమే కాకుండా గొప్ప పరిపాలకుడిగా రైతుల సంక్షేమం, న్యాయపాలన, అవినీతి రహిత వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. స్త్రీల గౌరవ పరిరక్షణ, మత సహనం ఆయన రాజధర్మానికి ప్రతీకలని పేర్కొన్నారు.1674లో రాజ్యాభిషేకంతో స్వరాజ్యానికి చిహ్నంగా నిలిచిన శివాజీ మహారాజ్ ఆశయాలు నేటికీ ప్రజలను ప్రేరేపిస్తున్నాయని, ఆయన చూపిన మార్గం నేటి తరాలకు శాశ్వత మార్గదర్శకమని స్వాములు పేర్కొన్నారు.


