జనం న్యూస్- ఫిబ్రవరి27-నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ కి ఇరువైపులా ఉన్న బౌద్ధ శిల్ప సంపదను, ఆచార్య నాగార్జున కాలంనాటి శిల్ప సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని ప్రముఖ రచయిత పున్న కృష్ణమూర్తి అన్నారు. నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లో దాసి సుదర్శన్ స్మారక చిత్ర కళానిలయం లో శుక్రవారం నాడు ధరణికోట నాగార్జునకొండ శిల్పకళ ఫై పరిశోదాత్మక పుస్తకం “అమరావతి ఆర్ట్ “ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అమరావతి ఆర్ట్స్ (ధరణికోట), నాగార్జున కొండల చారిత్రక ప్రాముఖ్యతని కొనసాగించాలని కోరారు. ఆచార్య నాగార్జున కి సంబంధించిన శిల్పాలు లండన్ లోని మ్యూజియంలో అమరావతి ఆర్ట్ గ్యాలరీ పేరున వేలాది మందిని ఆకట్టుకుంటున్నాయని, ఇటువంటి శిల్ప సంపదకు నాగార్జునసాగర్ లో గుర్తింపు లేకపోవడం బాధాకర విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలలో అమరావతి, నాగార్జునకొండ చరిత్రతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తులు,రాజకీయపక్షాలు, రచయితలు, కవులు ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మట్టి మనిషి వేలేపల్లి పాండురంగారావు, గ్రంథాలయ ఉద్యమనాయకులు కస్తూరి ప్రభాకర్, ప్రముఖ కార్టూనిస్ట్ నర్సింహా మాట్లాడుతూ దాసి సుదర్శన్ కళా నిలయంలో కళలు, సాహిత్యము,శిల్పకళలపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీన దాసి సుదర్శన్ రెండవ స్మారక వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసి సుదర్శన్ స్మారక కళానిలయం చైర్మన్ మోహన్ రాజు, సమత ప్రసాద్, కిరణ్మయి,విష్ణుమూర్తి, బాల ఈశ్వర్, స్వతంత్ర, గురువయ్య, సర్వారెడ్డి, టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


