Listen to this article

శాయంపేట, మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బాలమృతం పంపిణీ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. నిబంధనల ప్రకారం గర్భిణీ స్త్రీల ఫోటో నమోదు పూర్తయిన తర్వాతే బాలమృతం అందించాల్సి ఉంటుందని అంగన్వాడీ టీచర్ స్వరూపరాణి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడమే తన బాధ్యతనని చెప్పినందుకే తనపై అనవసర ఆరోపణలు, ఒత్తిడులు తెచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడినని చెప్పుకుంటూ కొమ్ముల శివ తీవ్రంగా స్పందించారని ఆమె ఆరోపించారు. రాజకీయ హోదా చూపిస్తూ బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీల ఫోటో నమోదు పూర్తయిన తర్వాతే నిబంధనల ప్రకారం అందజేస్తానని చెప్పిన మాటను వక్రీకరించి వివాదంగా మలిచారని తెలిపారు. ప్రతి నెల అదనంగా బాలమృతం ప్యాకెట్లు ఇచ్చిన విషయాన్ని పక్కనబెట్టి, ఒకసారి సరఫరా లోపం తలెత్తగానే రాజకీయ ఒత్తిడి తేవడం దురదృష్టకరమని స్వరూపరాణి విమర్శించారు. ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందిని బెదిరించడం సరైంది కాదని, అధికారుల సమక్షంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, కోడిగుడ్లపై తేదీల ముద్రణలో తలెత్తిన వివాదంపై ఇంచార్జీ సి డి పి ఓ ఉమా కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. సరఫరా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే సాంకేతిక లోపం చోటుచేసుకుందని పేర్కొంటూ, ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ పుణ్యవతి, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు….