

జనం న్యూస్ 10 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం: అధికారులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సమన్వయంతో కృషి చేసి నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలని ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోగల కెజీబీవి, జిల్లా పరిషత్ బాలర, బాలికల పాఠశాల, నలంద, బ్లూమింగ్‌బ్రడ్స్ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్ధులకు నులిపురుగు మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సంవత్సరం పిల్లలు మొదలుకొని 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండ జోల్ మాత్రలు వేసుకోవాలని ఆదేశించారు. ఈ మాత్రలతో పిల్లల్లో నులి పురుగుల సమస్య, రక్తహీనత, బుద్ధి మాంద్యం, చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి ఎల్వీ ప్రతాప్, వైద్యాధికారులు డాక్టర్ అమృత, నితీస్ తదితరులు పాల్గొన్నారు.