Listen to this article

జనం న్యూస్ మార్చ్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ట మరియు రాజగోపుర కలశ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక గవరపాలెంలో వెలసిన అమ్మవారి ఈ ఆధ్యాత్మిక వేడుకలో రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన సతీమణి పద్మావతితో కలిసి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న స్పీకర్ దంపతులకు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మేళతాళాలు మరియు పూర్ణకుంభంతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన పసిడి కలశాల నీరాజనం మరియు కలశ ప్రతిష్టా కార్యక్రమాల్లో వారు శాస్త్రోక్తంగా పాలుపంచుకున్నారు.​అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ దంపతులు పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కి, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ దంపతులు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర దంపతులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను తదితరులు తమ సతీమణులతో కలిసి పాల్గొన్నారు.​ఈ వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో పులకించింది. కోలాటాలు, శక్తి వేషధారణలు, భరతనాట్య ప్రదర్శనలు మరియు కేరళ డప్పు వాయిద్యాల హోరుతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో అనకాపల్లి పురవీధులు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి దర్శించుకున్నారు.