జనం న్యూస్ -మార్చి 9- నాగార్జునసాగర్ టౌన్-
నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెచ్ పి వి( హ్యూమన్ పాపులోమా వైరస్) వ్యాక్సినేషన్ సెంటర్ ను నల్లగొండ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పద్మ సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రి పరిధిలో బాలికలు అందరు హెచ్ పి వి టీకాను తీసుకునే విధంగా సిబ్బంది చేపట్టవలసిన కార్యచరణను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హెచ్ పి వి టీకాను మొదటిసారి బాలికలకు ఇస్తున్న సందర్భంగా జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులలో మాత్రమే ఈ టీకాను అందుబాటులో ఉంచామన్నారు. ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి వ్యాక్సినేషన్ ను పర్యవేక్షిస్తుంటారు అని అన్నారు. సాగర్ ఏరియా ఆసుపత్రి పరిధిలోని పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశా వర్కర్లు అర్హులైన బాలికలను వారి తల్లిదండ్రులు తోపాటు సాగర్ లోని హెచ్ పి వి వాక్సినేషన్ కేంద్రానికి తీసుకొని రావాలని ఆదేశించారు. వారంలో సోమ, మంగళ,గురు, శుక్ర వారాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటవరకు సాగర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో హెచ్ పి వి టీకాలు తమ వైద్య సిబ్బంది వేస్తారన్నారు. మహిళల్లో సర్వేకల్ ( గర్భాశయ) క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ టీకా ప్రైవేట్ లో సుమారు 4000 రూపాయల వరకు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఈ టీకాను అర్హులైన బాలికలందరూ వేసుకునేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. 14 సంవత్సరములు పూర్తయి 15 సంవత్సరములు నిండని బాలికలందరూ హెచ్ పి వి వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులన్నారు.నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 21 వేల బాలికలు ఈ టీకా వేసుకోవటానికి అర్హులుగా ఉన్నారన్నారు. ప్రస్తుతము నెలరోజుల పాటు ప్రతి ఏరియా ఆసుపత్రిలో ఈ టీకా అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు. ఆమెతోపాటు వ్యాక్సిన్ కోల్డ్ మేనేజర్ ఉదయ్, యు ఎఫ్ డబ్ల్యు సి వైద్యులు హరీష్, స్టెఫీ, సూపర్వైజర్ కమలమ్మ, హెల్త్ అసిస్టెంట్లు గంగాబాయి, తిరుమల చారి తదితరులు ఉన్నారు.


