జనం న్యూస్, మార్చి 14 – తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి: జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ తిమ్మప్ప ఆధ్వర్యంలో వడ్డేపల్లి ఎన్క్లేవ్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఆపి రోడ్డు భద్రతా నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే కారు వాహనదారులు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు చేస్తూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు.



