రంజాన్ ఏర్పాట్లపై కీలక ఆదేశాలు
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్
జహీరాబాద్ మార్చి 16: పవిత్ర రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో, జహీరాబాద్‌లోని ప్రధాన ఈద్గా వద్ద మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సోమవారం జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మహ్మద్ యూనుస్, స్థానిక కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులతో కలిసి ఈద్గాను సందర్శించారు. పండుగ రోజున వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈద్గా ఆవరణలో ఉన్న సౌకర్యాలను చైర్మన్ స్వయంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.నమాజ్ సమయానికి మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్ సౌకర్యాలు నిరంతరాయంగా అందేలా చూడాలని సంబంధిత విభాగాలకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులతో పాటు ఈద్గా కమిటీ సభ్యులు ఉన్నారు. పండుగ ఏర్పాట్లలో కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని చైర్మన్ తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పట్టణంలోని ముస్లిం సోదరులందరూ ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నదే తమ లక్ష్యమని, మున్సిపాలిటీ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.


