Listen to this article

జనం న్యూస్ 17 మార్చ్ ఘట్కేసర్ ప్రతినిధి :

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్, కొర్రెముల వెంకటాద్రి కాలనీ సెంట్రల్ క్రికెట్ గ్రౌండ్ లో గత ఎనిమిది రోజులుగా సాగిన క్రికెట్ పండుగ మంగళవారం సాయంత్రంతో అట్టహాసంగా ముగిసింది. సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మల్లారెడ్డి కల్పన కప్’ టోర్నమెంట్ క్రీడాకారుల కేరింతల మధ్య ముగిసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సతీమణి కల్పన 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ భారీ క్రికెట్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 66 జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయి. వారం రోజులకు పైగా సాగిన ఈ పోటీల్లో ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. తుది పోరులో ఘట్కేసర్, పీర్జాదిగూడ పోటీ పడగా పెర్జాదిగూడ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థిపై విజయం సాధించి, ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన భాగ్యనగర్ జట్టుకు ₹1,11,111 నగదు పురస్కారం మరియు ట్రోఫీని అందజేశారు. ద్వితీయ బహుమతి: రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ₹55,555 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో పోచారం వార్డు పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నేతలు, క్రీడాభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.