కారు, ఆటో ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
జనం న్యూస్ 22 మార్చి వికారాబాద్ జిల్లా
పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. ఆటోలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే కొడంగల్ మండలం పర్సాపూర్ తండాకు చెందిన కిష్టానాయక్ సహా ఐదుగురు కుటుంబ సభ్యులు శనివారం హైదరాబాద్ లో జరిగిన ఓ పెండ్లికి వెళ్లి సాయంత్రం ఆటోలో తిరిగి వస్తున్నారు. రాకంచెర్ల సమీపంలోకి రాగానే పరిగి నుంచి హైదరాబాద్ వైపు అతి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


