

- అడవులను- కొండల్లోని ఖనిజ సంపదను దోపిడీ శక్తులకు కట్టబెట్టే కుట్రలు పాలకులు విరమించుకోవాలి
- ఆదివాసి సంక్షేమ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
- జీవో నెంబర్ 3 ని పునరుద్ధరించాలి
- పోడు భూములకు పట్టాలివ్వాలి
జనం న్యూస్/ఫిబ్రవరి/బుట్టాయిగూడెం/రిపోర్టర్ :సోమరాజు నడపాల అడవులను- కొండల్లోని ఖనిజ సంపదను దోపిడీ శక్తులకు కట్టబెట్టే కుట్రలు పాలకులు విరమించుకోవాలని ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా చేయడం జరిగింది.ఇటీవల విశాఖలో జరిగిన టూరిజం సదస్సులో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరిస్తానని వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తూ, ఆదివాసి సంక్షేమ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఏజెన్సీ గిరిజన సంఘం, రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రోడ్లగుండ ప్రదర్శన, ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా గిరిజన సంక్షేమ చట్టాలను ఉద్దేశపూరితంగానే పాలకులు అమలు చేయట్లేదని, సామ్రాజ్యవాదులకు, స్వదేశీ- విదేశీ పెట్టుబడిదారులకు అడవులను, భూమి పొరల్లో దాగివున్న అపారమైన సంపదను అప్పగించడం కోసం పాలకులు అనేక కుట్రలు చేస్తున్నారని ఆ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన టిడిపి ప్రభుత్వం అడవులను కొండలను ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అప్పగించడం కోసం తీవ్రంగా ప్రయత్నించడం లో భాగంగానే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరిస్తానని వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3 ని పునరుద్ధరిస్తామని చెప్పి, టిడిపి ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ఆదివాసి సంక్షేమ చట్టాలను అమలు చేయకుండా గిరిజనతరులకు ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఆదివాసులను అడవుల నుండి గెంటివేసే కుట్రలకు వ్యతిరేకంగా, ఆదివాసి సంక్షేమ చట్టాల ఎత్తివేతకు యత్నిస్తున్న పాలకుల విధానాలపై సంఘటిత ఉద్యమాలు నిర్మించడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కర్తవ్యం అని పిలుపునిచ్చారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరిస్తామని చెప్పడం ఆయన వ్యక్తిగత విషయం కాదన్నారు. నిన్న ఏజెన్సీ బంద్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో 1/ 70 చట్టాన్ని సవరించమని చెప్పడం కాదు, 24 నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన హామీని ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం నియోజకవర్గం గిరిజన అభ్యర్థిగా గెలిచిన చిర్రి బాలరాజు స్పీకర్ వ్యాఖ్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. 2000సంవత్సరానికి ముందు కూడా టిడిపి ప్రభుత్వం 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆదివాసి ప్రజలు పోరాడిన ఫలితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. గిరిజన చట్టాలను అమలు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సవలం రాంబాబు మాట్లాడుతూ పోలవరం ఏజెన్సీలో అన్యాక్రాంతమైన తమ భూములను గిరిజనులు గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్న వాటికి సాగు నమోదు చేయడం గాని హక్కులు కల్పించకపోవడం దారుణం అన్నారు. తక్షణమే గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు సాగున నమోదు చేసి, హక్కులు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొరగం భూచంధ్రరావు మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వం 1/ 70 చట్టాన్ని సవరించాలన్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన సాగిందన్నారు. అదేవిధంగా సంక్షేమ చట్టాలు అమలుకై సమిష్టిగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు దాడి రాముడు,ఆదివాసీ గిరిజన సంఘం నాయకులుతామ బాలరాజు, మడివి చలపతిరావు, గోకూరి పాండవులు, కె పోసిరత్నం, మిడియం పండు దొర, గంగాదేవి, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు కలుం చిన్న అబ్బులు, పట్టెం పరమేశు, కొమరం రామారావు, మడకం పోశమ్మ తదితరులు పాల్గొన్నారు.