జనం న్యూస్ మార్చి 23: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గోదావరి నది తీరాన గల శ్రీ దత్త సాయి బాబా మందిరం పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ఆధ్యాత్మిక విజ్ఞాన మహాసభలు భక్తి పారవశ్యంతో నిండాయి.ఈ సందర్భంగా పీచర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విశ్వేశ్వరానందగిరి స్వామి బ్రహ్మ ముహూర్త సమయంలో “మేల్కొలుపు” గానామృతంతో భక్తులను ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించారు. అనంతరం నిర్గుణ తత్వ మహారాజ్ సారథ్యంలో శిష్యులు, భక్తులు సామూహిక భజనలు చేస్తూ, నృత్యాలతో ఆనందోత్సాహాల మధ్య గోదావరి నదికి వెళ్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి హారతిని ఘనంగా నిర్వహించారు.ఈ మహాసభల్లో శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వాములు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.ఈ సందర్భంగా ఆశ్రమాలయ వ్యవస్థాపకులు, మహాసభల కన్వీనర్ శ్రీ నిర్గుణ తత్వ మహారాజ్ మాట్లాడుతూ “మానవుడే మాధవుడు అంటే ప్రతి మనిషిలోనూ దైవం అంతర్లీనంగా ఉంది. అజ్ఞానం, భ్రమలను తొలగించి ఆత్మజ్ఞానం పొందినవాడే నిజమైన దేవుడు. సత్కార్యాలు చేసే మనిషి దైవత్వానికి చేరువవుతాడు. ఇతరులకు సహాయం చేసే వారే ఈ లోకంలో నిజమైన మాధవులు” అని తెలిపారు.
కార్యక్రమంలో వేద ప్రకాశానందగిరి, అరుణానంద మాతాజీ, శ్రీశైలం మాతాజీ, నిరాకార శివపరమాత్మ విశ్వవిద్యాలయం హైదరాబాద్కు చెందిన సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, పద్మశ్రీ, లక్ష్మీ రాజేశ్వర్ దంపతులు, మాందాపూర్ నర్సింహారెడ్డి, సత్యం (ఫోటోగ్రాఫర్), మీడియా కన్వీనర్ కంకణాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తడపాకల్, ఆర్మూర్, వేల్పూర్, నిజామాబాద్, పీచర, తాళ్లరాంపూర్, మనోహరాబాద్, పాలెం, తొర్తి ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు.



