Listen to this article

జనం న్యూస్ 24 మార్చి వికారాబాద్ జిల్లా

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని డి.ఏ.ఆర్ (District Armed Reserve) హెడ్ క్వార్టర్స్‌ను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపిఎస్ ఈ రోజు సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ముందుగా అక్కడి పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి పనితీరు, విధులు తదితర అంశాలపై సమాచారం తెలుసుకున్నారు. తదుపరి, హెడ్ క్వార్టర్స్‌లోని వివిధ విభాగాలను ఎస్పీ సందర్శించి ఆర్మరీ రూమ్, డ్యూటీ ఆఫీసర్స్ రూమ్, బి.డి టీమ్ రూమ్ వంటి ముఖ్య విభాగాల పనితీరును పరిశీలించారు. అలాగే ఆర్‌ఐ ఆఫీస్, డి‌ఎస్‌పి ఆఫీస్‌లను పరిశీలించి, అక్కడి నిర్వహణ విధానాలపై సూచనలు చేశారు. అనంతరం పోలీస్ క్యాంటీన్, డి.ఏ.ఆర్ పరిసరాలు, ఎం.టి సెక్షన్, గ్యాస్ ఆఫీస్, గ్యాస్ గోదాం, వాటర్ ప్లాంట్ వంటి విభాగాలను కూడా సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా క్లూస్ టీమ్‌కు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ నుండి వచ్చిన ప్రత్యేక వాహనాన్ని పరిశీలించి, దాని వినియోగం మరియు నిర్వహణపై ఆరా తీశారు. అలాగే వాటర్ ప్లాంట్ వద్ద నీటి నాణ్యతను స్వయంగా పరీక్షించి, శుద్ధమైన త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. “జిల్లా పోలిడ్ ఆర్మూడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ అనేది జిల్లా రక్షణ వ్యవస్థకు వెన్నెముక వంటిది. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో పాటు తమ పని ప్రదేశాన్ని కూడా శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడం చాలా అవసరం. నేడు డీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో పరిసరాలు పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహించబడుతున్నాయి అనేది ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇది పోలీస్ సిబ్బంది క్రమశిక్షణకు నిదర్శనం. హోం శాఖ నుండి వచ్చిన కొత్త క్లూస్ టీమ్ వాహనం నేర పరిశోధనలో మరింత సాంకేతిక సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే, ఆయుధాలు, వాహనాలు మరియు ఇతర వనరులను అత్యంత జాగ్రత్తగా సంరక్షించడం ప్రతి సిబ్బంది బాధ్యత. పోలీస్ శాఖలో ప్రతి విభాగం సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన భద్రత, సేవలు అందించగలుగుతాము. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలి జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,ఐ‌పి‌ఎస్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, డి.ఏ.ఆర్‌ డి‌ఎస్‌పి వీరేష్, ఆర్‌ఐ నాగరాజు, ఎం‌టి‌ఓ శ్రీశైలం,ఆర్‌ఎస్‌ఐ లు , సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.