Listen to this article

జనం న్యూస్ 31 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న 2 నెలల కూలీలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 న జరిగే ధర్నాకు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సి పి యం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ కూలీలకు పిలుపు ఇచ్చారు. శనివారం గద్వాల మండలంలోని శెట్టి అత్కుర్, సంఘాల గ్రామాలలోని ఉపాధి కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఉన్న చట్టబద్ధ పనిని రద్దు చేసి, కోరలు లేని వీబీజీ రామ్ జీ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత ఉపాధి హామీ చట్టం ద్వారా కనీస ఉపాధి పొంది తమ జీవితాలను నిలబెట్టుకుంటున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం పేదల నోటి కాడి కుడు లాగేయడానికి ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి నిధులను తగ్గించిందని విమర్శించారు. రాష్ట్రాలపై భారం మోపి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నదని, పేదలకు అన్యాయం చేసే ఈ బిల్లు ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే శెట్టి అత్కుర్ సంఘాల గ్రామాలలోని ఉపాధి కూలీలకు 2 నెలల కూలీలు పెండింగ్లో ఉన్నాయని, పని ప్రదేశాలలో సైతం ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. కూలీలు గ్రామం నుండి రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ ఎటువంటి ప్రయాణ భత్యం చెల్లించడం లేదన్నారు. కూలీలకు నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా పనిచేస్తారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే ఉపాధి పనికి సరిపడ నిధుల కేటాయించకుండా పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది కూలీలకు ఫోటో క్యాప్చర్ రావడం లేదని ,దీనివల్ల కూలీలు పనిచేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం భూమిలేని కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి, అమలు చేయడం లేదన్నారు. ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 తేదీన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు జిల్లాలోని ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, ఉపాధి కూలీలు సవారన్న, చిన్న హనుమంతు, రాజయ్య, సునీత, లక్ష్మి, జయమ్మ, మహేశ్వరి, యశోద, మహేష్, రాజేశ్వరి, రాము తదితరులు పాల్గొన్నారు.ధన్యవాదాలతో ఉప్పేర్ నరసింహ సి పి యం జిల్లా కమిటీ సభ్యులు జోగులాంబ గద్వాల జిల్లా