జనం న్యూస్ మార్చి 31: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, తరగతి గదిలో బోధన పట్ల ఆకర్షణ కలిగించే ఉద్దేశంతో ‘చెలిమి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పీఎం శ్రీ పథకం భాగంగా పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కె. గంగామోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.విద్యార్థులకు అనుకూలమైన, సానుభూతితో కూడిన వాతావరణాన్ని సృష్టించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులను భాగస్వాములను చేస్తూ పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. తమ ఆలోచనలకు అనుగుణంగా నేమ్ ట్యాగులు తయారు చేయడం, మిర్రర్ రిఫ్లెక్షన్ ద్వారా తోటి స్నేహితులను అనుకరించడం, హ్యాండ్ డ్రాయింగ్ ద్వారా తమ అభిరుచులు, అలవాట్లను వ్యక్తపరచడం వంటి కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.ఇక మైండ్‌ఫుల్ బ్రీతింగ్, మైండ్‌ఫుల్ సీయింగ్, స్క్వేర్ బ్రీతింగ్ టెక్నిక్, స్పెషల్ వాక్, ‘బ్యూటిఫుల్ యు’, మిల్లింగ్ యాక్టివిటీలతో కార్యక్రమం మరింత ఆసక్తికరంగా సాగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి మాట్లాడుతూ, ‘చెలిమి’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సులభంగా అన్ని విషయాలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. బట్టి పట్టే పద్ధతికి బదులుగా ఆనందంతో, ఆసక్తితో నేర్చుకునే విధానానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. దీంతో విద్యార్థుల్లో పాఠశాల పట్ల స్నేహపూర్వక భావన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, సమిత, ఎస్. శ్రీనివాస్, విజయ్, రాజేందర్, రాజనర్సయ్య, జ్యోతి, ట్వింకిల్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



