జనం న్యూస్ 31 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష
2026 – 2027 బడ్జెట్ సమావేశం
గద్వాల వార్షికాదాయం రూ.24.84 కోట్లు
ఖర్చు రూ.27 56 కోట్లు
జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణ అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘం అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గద్వాల మునిసిపాలిటీ బడ్జెట్ సమావేశాన్ని మంగళవారం స్థానిక అక్షయ బంకిట్ హాల్లో పుర చైర్ పర్సన్ జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న మొదటి బడ్జెట్ సమావేశం కావడంతో నూతన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల మునిసిపాలిటీ ఆస్తిపన్నుల వసూళ్లలో లక్ష్యం కంటే ఎక్కువగానే వసూలు చేయడంతో పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ కు ఎంపిక కావడం జరిగిందని సంబంధిత అధికారులను అభినందించారు. ప్రభుత్వం నుంచి గద్వాల మునిసిపాలిటీకి రూ.8.5 కోట్ల స్టాంపు డ్యూటీ నిధులు రావాల్సి ఉందని, ఇతర ఆదాయ మార్గాల్లో రూ.23 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనల కట్టుదిట్ట అమలు, పార్కుల నిర్వహణ, పట్టణ సుందరీకరణ, తదితర అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. ముఖ్యమైన జంక్షన్ల వద్ద భారీ ఫ్లెక్సీ లను ఉంచడంతో ఇబ్బందికరంగా ఉందని, ఫ్లెక్సీలతో పాటు ప్లాస్టిక్ నివారణకు కౌన్సిల్లో తీర్మానం చేసి అమలు చేయాల్సిందిగా సూచించారు. మున్సిపాలిటీలో ప్రతి ఉద్యోగి, ఇతర కార్మికులు బయోమెట్రిక్ విధానంలో హాజరు వేయాలని, 280 మంది కార్మికులు ఉండడంతో మునిసిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, తాగునీటి వృధాను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గద్వాల మునిసిపాలిటీ దుకాణాల ఆదాయం కూడా పెరిగేందుకు నిబంధనల ప్రకారం వేలంపాట నిర్వహించాలని, జనరల్ ఫండ్ సద్వినియోగం చేసుకునేలా ముందుకెళ్లాలన్నారు. మునిసిపాలిటీ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, శానిటేషన్, తాగునీటి సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే
గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు పార్టీలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా సహకరించాలన్నారు. గత కౌన్సిల్ సమయంలో గద్వాల పట్టణ అభివృద్ధికి రూ.18 కోట్ల నిధులను ఖర్చు పెట్టడం జరిగిందని, భవిష్యత్తులోనూ గద్వాల మునిసిపాలిటీకి ఎక్కువ నిధులు వచ్చేలా తన వంతుగా కృషి చేస్తానన్నారు. అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ పట్టణ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు నిరంతరం వార్డుల్లో తిరుగుతుంటారు కాబట్టి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా బాధ్యత తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో సిసి రహదారులు, మురుగు కాలువలు, వీధిదీపాలు, తాగునీరు వంటి మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించడమే ధ్యేయంగా తన వంతుగా సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు. మునిసిపాలిటీలోని వివిధ విభాగాల అధికారులు నిబద్ధతతో, పారదర్శకంగా పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అంతకుముందు గద్వాల మున్సిపాలిటీ బడ్జెట్ ప్రతులను జూనియర్ అకౌంట్స్ అధికారి రాజు చదివి వినిపించారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గద్వాల మున్సిపాలిటీకి ఆస్తి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్, మున్సిపల్ దుకాణాల అద్దెలు, వివిధ నిధులు, తదితర రూపాల్లో మొత్తం రూ.24.84 కోట్ల అంచనా ఆదాయాన్ని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు, ఇంజనీరింగ్ విభాగం ఖర్చులు, సాధారణ పరిపాలన వ్యయం, తదితర మొత్తం అంచనా ఖర్చు రూ.27.56 కోట్లుగా ప్రస్తావించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్ ను సన్మానించారు. అలాగే పదవీ విరమణ పొందుతున్న మున్సిపాలిటీ కార్మికుడు వెంకటరాజును కలెక్టర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, మున్సిపాలిటీ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, ఇతర అధికారులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.


