Listen to this article

జనం న్యూస్ 1 ఏప్రిల్ ఘట్కేసర్ ప్రతినిధి : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం గ్రామ ప్రధాన రహదారి సమస్యలతో పాటు గ్రామంలో నెలకొన్న పలు మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డికి వినతి పత్రం అందజేశారు. బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో పోచారం బొడ్డురాయి నుండి డివిజన్ కార్యాలయం వరకు గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌కు గ్రామ సమస్యలపై వివరించారు. జోడిమెట్ల నుండి పోచారం వరకు ఉన్న ప్రధాన రోడ్డు ఒకవైపు డ్రైనేజీ పనుల కోసం పూర్తిగా తవ్వడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గత కొన్ని నెలలుగా ఒకే వైపు నుండి వాహనాలు వెళ్లాల్సి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడం, మరియు దోమల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారి తవ్వకాల వల్ల ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేసి, రోడ్డును పునరుద్ధరించాలని సామల సందీప్ రెడ్డి, యువ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సామల బుచ్చిరెడ్డి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బద్దం నర్సింహ రెడ్డి, ఎస్. శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, ఎస్. కొండల్ రెడ్డి, కనకచారి, జి. నరేష్, ఎస్. సత్తిరెడ్డి, ఎం. మహేందర్ రెడ్డి మరియు ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.