Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

నగరాల్లో పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని మరోసారి రుజువైంది. రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ వీధిలో నిర్వహించిన ప్రత్యేక శుభ్రత కార్యక్రమం దీనికి నిదర్శనంగా నిలిచింది.కాలనీలోని రోడ్లపై పేరుకుపోయిన మట్టి కుప్పలు, చెత్తను తొలగించేందుకు ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ డ్రైవ్‌కు ఆల్విన్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి, జవాన్ కుమార్ తదితర మున్సిపల్ సిబ్బంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో కాలనీవాసులు, కమిటీ సభ్యులు కలిసి రోడ్లను శుభ్రపరిచి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి మాట్లాడుతూ, “మా కాలనీలో ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే మున్సిపల్ అధికారులతో సమన్వయం కీలకం. కాలనీలో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం కోసం మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జి. నర్సింగ్ రావు, సూర్యనారాయణ, శ్రీధర్, ప్రసాద్, నాని, రమణ, బాబి తదితరులు చురుకుగా పాల్గొన్నారు. వారి సమిష్టి కృషితో రామకృష్ణ వీధిలోని రోడ్లన్నీ శుభ్రంగా మారాయి.
కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన మున్సిపల్ అధికారులకు, కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు అధ్యక్షులు పురంధర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.