జనంన్యూస్ . 06. నిజామాబాదు రురల్. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో రైతుల సమస్యలపై స్పందిస్తూ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చౌటుపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చౌటుపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ, వరి కోతలు ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.ఒకవైపు గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దళారుల చేతిలో దోపిడీకి గురవుతూ, క్వింటాల్‌కు కేవలం ₹1900/-ల తక్కువ ధరకు వడ్లను అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అధికారులు సర్వే నిర్వహించి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతుల తరఫున భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.



