నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్.
జనం న్యూస్ 06 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి
స్వాతంత్ర్య సమరయోధుడు, నవభారత నిర్మాత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన సేవలను స్మరించుకున్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రామ్ 1908లో బీహార్ రాష్ట్రంలోని ఒక పేద కుటుంబంలో జన్మించి, అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత పదవులను అధిష్టించిన మహనీయుడని కొనియాడారు. చిన్నతనం నుంచే సమాజంలో ఉన్న కుల వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆయన, విద్యనే ఆయుధంగా చేసుకుని అన్యాయాలపై పోరాడారని పేర్కొన్నారు. స్వతంత్ర భారత తొలి క్యాబినెట్లో అతిపిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగ్జీవన్‌రామ్ కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను అమలు చేసినట్లు ఎస్పీ వివరించారు. బాబు జగ్జీవన్‌రామ్ జీవితం ఒక తెరిచిన పాఠశాల వంటిదని, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎస్పీ అన్నారు.చివరగా, “ఆయన ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సోదరభావం కలిగిన సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత” అని ఎస్పీ పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, దేశ సమగ్రతకు కృషి చేయడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంటూ, మాతృదేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐలు నాగరాజు, శ్రీశైలం, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


