Listen to this article

జనంన్యూస్. 07.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్.

పేద విద్యార్థుల భవిష్యత్తుకై అంకితభావంతో సేవలందించిన జాకీర్ హుస్సేన్‌కు భావోద్వేగ నివాళులు
ప్రియమైన గురువును కోల్పోయి కన్నీటిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు.నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఉన్న కిడ్స్ పార్క్ పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. పాఠశాల కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన సేవలను స్మరించుకుంటూ పాఠశాల హెడ్మాస్టర్ ఆసిఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన గురువును కోల్పోవడం పాఠశాల కుటుంబానికి తీరని లోటుగా మారిందనీ కన్నీరు మున్నీరు అయ్యారు.బాల్యం:తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన జాకీర్ హుస్సేన్ సాధారణ కుటుంబంలో జన్మించారు. కుటుంబంలో పెద్ద కుమారుడిగా చిన్ననాటి నుంచే బాధ్యతలను అర్థం చేసుకుంటూ పెరిగారు. చదువుపై ఆసక్తి కలిగిన ఆయన గడ్కోల్ గ్రామంలో ఎస్‌ఎస్‌సీ విద్యను అభ్యసించి క్లాస్ ఫస్ట్‌గా ఉత్తీర్ణత సాధించారు.2011 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి మరణించడం కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ ఆయన భుజాలపై పడ్డాయి. ఇద్దరు తమ్ముళ్లకు పెద్ద అన్నగా అండగా నిలిచి కుటుంబాన్ని ముందుకు నడిపించారు. కష్టాలను ఎదుర్కొంటూనే చదువు కొనసాగించడం ఆయన పట్టుదలకు నిదర్శనం.విద్యాభ్యాసం – ఉపాధ్యాయ జీవిత ప్రారంభం సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలనే లక్ష్యంతో హిందీ పండిత్ విద్యను అభ్యసించారు. ఉపాధ్యాయ వృత్తిని సేవగా భావించిన ఆయన రామడుగు పాఠశాలలో ఐదు సంవత్సరాల పాటు పనిచేశారు. అక్కడ విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవన విలువలు, క్రమశిక్షణ, మంచి నడవడికను బోధించారు.తర్వాత ధర్పల్లి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చేరి దాదాపు పదేళ్ల పాటు సేవలందించారు. విద్యార్థులపై ప్రేమ, అంకితభావంతో మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు.స్వప్నంగా పుట్టిన పాఠశాల. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించిన జాకీర్ హుస్సేన్ 2019లో సిరికొండ మండల కేంద్రంలో కిడ్స్ పార్క్ పాఠశాలను స్థాపించారు. ప్రారంభ సంవత్సరంలోనే కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో పాఠశాల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురైనా ఆయన వెనుకడుగు వేయలేదు. ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ పాఠశాలను నిలబెట్టారు.పేద విద్యార్థులకు పాఠశాలలో ఉచిత విద్య విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సిరికొండ మండల పరిసర గ్రామాల పేద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు కల్పించారు. పాఠశాల ప్రారంభం నుంచి ఆయన మరణించే వరకు దాదాపు 30 మంది విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యను అందించారు. ఫీజులు చెల్లించలేని కుటుంబాలకు సహాయం చేస్తూ పిల్లల చదువు ఆగకుండా చూసుకున్నారు. కొంతమందికి పుస్తకాలు, యూనిఫామ్‌లు కూడా అందించి విద్యా సేవను కొనసాగించారు.వ్యక్తిత్వం – సేవే లక్ష్యం..జాకీర్ హుస్సేన్ కేవలం పాఠశాల నిర్వాహకుడు మాత్రమే కాదు, విద్యార్థులకు మార్గదర్శకుడు. వినయం, సేవాభావం, క్రమశిక్షణ ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేశారు. ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు..తీరని లోటు.అనుకోకుండా అనారోగ్యం బారిన పడి గత నెలలో ఆయన మరణించడం విద్యారంగానికి తీరని లోటుగా మారింది. నివాళి కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ, “జాకీర్ హుస్సేన్ గారు చూపిన మార్గంలోనే పాఠశాలను ముందుకు తీసుకెళ్తాం” అని తెలిపారు.సేవా తపనతో జీవించి, అనేక పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివే. విద్యను సేవగా భావించిన ఆ మహానుభావుని జీవితం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది.