Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 11 సెల్ 9550978955

తల్లి ప్రేమకు తోడైన ఎమ్మెల్యే భరోసా.. రూ. 9 లక్షల ఎల్ఓసీతో సక్సెస్ అయిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స

చిలకలూరిపేట: రాజకీయ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, ఆపదలో ఉన్నవారి కన్నీళ్లు తుడిచేవారే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యం అందక, డబ్బు లేక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే సంకల్పంతో ఆయన చేసిన సాయం, ఒక నిరుపేద యువకుడికి పునర్జన్మను ప్రసాదించింది. కలచివేసిన ‘సాయి’ దీనగాథ చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన గుంటూరు రమాదేవి ఏకైక కుమారుడు గుంటూరు సాయి (22). చిన్న వయసులోనే రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్‌పై ఉంటూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ దీన స్థితిపై వచ్చిన కథనం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి వెళ్లింది. వార్త చూసిన వెంటనే స్పందించిన ఆయన, రిపోర్టర్ మస్తాన్ వలికి ఫోన్ చేసి బాధితులను తన వద్దకు పంపాలని సూచించారు.రూ. 9 లక్షల ఎల్ఓసీ.. వెన్నంటే ఉండి భరోసా
బాధితుల పరిస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే, పార్టీలకు అతీతంగా స్పందించారు. గత నెల మార్చి 4వ తేదీన ఏకంగా 9 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ఎల్ఓసీ (Letter of Credit) మంజూరు చేయించారు. అంతటితో ఆగకుండా, గుంటూరులోని విశిష్ట హాస్పిటల్ యాజమాన్యంతో స్వయంగా మాట్లాడి, శస్త్రచికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, బాధితుల వద్ద నుంచి పైసా ఆశించవద్దని ఆదేశించారు.సక్సెస్ అయిన ఆపరేషన్.. తల్లి కొడుకుల ఆనందం తల్లి ప్రేమకు మించింది లేదని నిరూపిస్తూ.. రమాదేవి తన కుమారుడికి ఒక కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహాయంతో నిన్న శుక్రవారం వైద్యులు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.నా కొడుకును ఎలా బ్రతికించుకోవాలో తెలియక కన్నీరు మున్నీరయ్యాను. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దేవుడిలా వచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మా ప్రాణాలను నిలబెట్టిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.”…గుంటూరు రమాదేవి, బాధితుడి తల్లి రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్లను అత్యధికంగా ఇప్పించిన నేతగా గుర్తింపు పొందిన ప్రత్తిపాటి పుల్లారావు, మరో ప్రాణాన్ని నిలబెట్టి నియోజకవర్గ ప్రజల ప్రశంసలు అందు కుంటున్నారు.