జనం న్యూస్ ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ యంత్రాంగం విస్తృతంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పి.ఏ.సి చైర్మన్ ఆదేశాల మేరకు వివేకానంద నగర్ డివిజన్‌లోని రామకృష్ణ వీధిలో గత రెండు రోజులుగా ప్రత్యేక శుభ్రత డ్రైవ్ నిర్వహించారు.కాలనీలో పేరుకుపోయిన చెత్తకుప్పలు, మట్టి దిబ్బలు, రాళ్లు తదితరాలను మున్సిపల్ సిబ్బంది యంత్రాలతో తొలగించి, రహదారులను పూర్తిగా శుభ్రం చేశారు. ట్రాక్టర్ల సహాయంతో చెత్తను తరలిస్తూ కాలనీలో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేశారు.ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతరంగా శ్రమించి రోడ్లపై ఉన్న చెత్తను తొలగించినట్లు చెప్పారు.కాలనీవాసులు ఇకపై రోడ్లపై చెత్త వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది జవాన్ కుమార్, సూపర్వైజర్ రవీందర్ నాయక్, కమిటీ సభ్యులు శ్రీధర్, జి. ప్రసాద్, సుధాకర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.అధ్యక్షుడు పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీలో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని, కాలనీవాసుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు మున్సిపల్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పరిశుభ్రత కార్యక్రమం వల్ల కాలనీలో స్వచ్ఛత మెరుగుపడడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



