Listen to this article

జనంన్యూస్. 29. నిజామాబాద్ రూరల్. శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల సొసైటీకి సంబంధించి ఇటీవల ప్రచురితమైన “100 కోట్ల బోనస్ కుంభకోణం” వార్తలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. బుధవారం చిన్న వాల్గోట్ గ్రామంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడారు.రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024, 2025 ఖరీఫ్ సీజన్లలో మాత్రమే బోనస్ అందిందని, అయితే పత్రికల్లో నాలుగు సీజన్లుగా బోనస్ వచ్చినట్లు ప్రచురించడం సరైంది కాదన్నారు. అలాగే మైలారం గ్రామం పీఏసీఎస్ ద్వారా 11 రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా జరిగితే, కేవలం నాలుగు మిల్లులను మాత్రమే ప్రస్తావించడం కూడా సరైన విధానం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖరీఫ్-2025లో సిరికొండ పీఏసీఎస్ ద్వారా 1,35,701.2 క్వింటాళ్ల ప్యాడి కొనుగోలు జరిగిందని, దీనికి ప్రభుత్వం నుంచి మొత్తం రూ.96.21 లక్షల బోనస్ మాత్రమే మంజూరైందన్నారు. అందులో నాలుగు రైస్ మిల్లులకు రూ.38.15 లక్షలు జమయ్యాయని తెలిపారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాధారిత వార్తలు ప్రచురించాలని కోరారు. లేనిపక్షంలో సంబంధిత పత్రిక యాజమాన్యంతో పాటు ఈ ప్రచారానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.ఇప్పటికే అధికారులు రైతులు, సెంటర్ ఇన్‌చార్జీలు, మిల్లర్లు, సొసైటీ ప్రతినిధుల వాంగ్మూలాలు నమోదు చేస్తూ ఎంక్వైరీ నిర్వహించారని చెప్పారు. సొసైటీలకు ముందుగానే అలాట్మెంట్లు ఇచ్చి ఉంటే రైతులకు ఇబ్బందులు తగ్గేవని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే చొరవతో మైలారం మినహా అన్ని సొసైటీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బడాల మైపాల్, లింబాద్రి, యువ నాయకులు బాబు ప్రసాద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.